
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లలో మరోసారి ఎలాంటి మార్పు జరగలేదు. వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఫెడ్ ప్రకటించింది. దీంతో ఈ రేటు 1-1.25శాతం శ్రేణిలో ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థ బాగానే కోలుకుంటోందని, ఉద్యోగాల విపణి మరింత బలోపేతమైందని విధాన కర్తలు అభిప్రాయపడ్డారు. అందుకే వడ్డీరేట్ల పెంపునకు కమిటీ విముఖత వ్యక్తం చేసింది. అంతకముందు 2017లో మూడుసార్లు వడ్డీ రేట్లను పెంచుతామని ఫెడ్ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే మార్చి, జూన్ల్లో రెండుసార్లు పెంచింది. ఇక డిసెంబర్లో జరిగే సమావేశంలో మూడోసారి రేట్ల పెంపు జరగొచ్చని అంచనాలు వెలువడుతున్నాయి.
మరోవైపు ఫెడ్ ఛైర్మన్ జానెట్ యెలెన్ పదవీకాలం 2018 ఫిబ్రవరిలో పూర్తికానుంది. దీంతో కొత్త ఛైర్మన్ ఎంపిక గురువారం జరగనుంది. ఈ పీఠంపై ఎవరు కూర్చుంటారనేది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించే అవకాశం ఉంది. అమెరికా కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం జరగబోయే సమావేశంలో ఫెడ్ గవర్నర్ జెరోవ్తో కలిసి ట్రంప్ కొత్త ఛైర్మన్ పేరును ప్రకటిస్తారు.